కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే: బండి సంజయ్

రైతు చట్టాల విషయంలో కూడా పూటకో మాట మాట్లాడారు

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీపై మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని విమర్శించారు. రాష్ట్రంపై కేంద్రం పెత్తనం ఏందని నిలదీసే కేసీఆర్… మళ్లీ, ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనడం లేదని అంటారని ఎద్దేవా చేశారు. వరి కొంటామని అగస్టు 31వ తేదీనే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని… కానీ, లేఖ రాయలేదని కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకసారి వరి వేయాలని, మరొకసారి వేయవద్దని చెపుతూ రైతులను తికమకపెడుతున్నారని దుయ్యబట్టారు.

రైతు చట్టాల విషయంలో కూడా కేసీఆర్ పూటకో మాట మాట్లాడారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ పండుతోందో కేసీఆర్ చూపించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద స్కాం చేశారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఢిల్లీకి వెళ్తే కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచలేదని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. లీటర్ పై కేంద్రానికి రూ. 27 వస్తే రాష్ట్రానికి రూ. 28 వస్తోందని అన్నారు. కేంద్రానికి వెళ్లే రూ. 27లో రాష్ట్రానికి మళ్లీ రూ. 12 తిరిగి వస్తాయని చెప్పారు.

తనను మెడలు నరుకుతాననని కేసీఆర్ అన్నారని… ఎప్పుడు నరుకుతారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తనకు ఇంగ్లీష్, హిందీ రాదని కేసీఆర్ అన్నారని.. తాను పేద ప్రజల మనసులోని బాధలను, కష్టాలను చదువుకున్నానని చెప్పారు. మందు తాగి బండి నడిపితే తప్పయినప్పుడు… మందు తాగి ప్రభుత్వాన్ని నడపడం కూడా తప్పేనని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/