సంక్రాంతి ఎఫెక్ట్ : రైల్వే ప్రయాణికులఫై ఫ్లాట్‌ఫాం టికెట్ భారం..

పెద్ద పండగ వస్తుందంటే చాలు రైల్వే ఫ్లాట్‌ఫాం టికెట్ ధరలను అమాంతం పెంచేస్తుంటుంది దక్షిణ మధ్య రైల్వే. మొన్నటి వరకు కరోనా ఉదృతి నేపథ్యంలో రద్దీని తగ్గించే క్రమంలో రైల్వే ఫ్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచింది రైల్వే..ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా మరోసారి రైల్వే ఫ్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచి ప్రయాణికుల ఫై భారం మోపింది.

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. నిన్నటి వరకు ప్లాట్‌ఫాం టికెట్‌ ధర రూ.10గా ఉండగా.. అది రెట్టింపు అయ్యింది. సంక్రాంతి నేపథ్యంలో ఫ్లాట్‌ఫాంపై ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు అధికారులు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అమలులో ఉండనుంది. అయితే, సికింద్రాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతానికి పాత ధరలే కొనసాగిస్తున్నారు. మరి అవి కూడా పెంచేతారో లేక అదే ధర ఉంచుతారో చూడాలి.

ఇక సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, ఏపీలోని ఇతర స్టేషన్‌ల నుంచి ఏపీ, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి విజయవాడ, విశాఖపట్నం, నర్సాపూర్, కాకినాడ ప్రాంతాలకు నడపనున్నట్లు తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

మచిలిపట్నం నుంచి కర్నూలు సిటీకి, కర్నూలు నుంచి మంచిలిపట్నంకు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. తిరుపతి నుంచి నాందేడ్‌, కాకినాడ నుంచి లింగంపల్లి, లింగంపల్లి- కాకినాడ, నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, కాకినాడ-లింగంపల్లి, నర్సాపూర్‌-కాచిగూడ, మచిలిపట్నం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌- మచిలిపట్నం, తిరుపతి-అకోలా, అకోలా- తిరుపతి, పూర్ణ-తిరుపతి, తిరుపతి – పూర్ణం, కాచిగూడ- కొల్లం, కొల్లం-కాచిగూడ, సికింద్రాబాద్‌-కొల్లం ఇలా ఇంకా చాలా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు.