బిజెపి మద్దతివ్వడం వల్లే తెలంగాణ వచ్చిందిః బండి సంజయ్

ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శ

bandi-sanjay

హైదరాబాద్ః కెసిఆర్‌ ప్రభుత్వం మహిళల భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా? అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. ఆనాడు బిజెపి మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని… కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. ఆ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కెసిఆర్ కుటుంబం కోసమా అని ప్రజలు బాధ పడుతున్నారని చెప్పారు.

మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను కెసిఆర్ అప్పుల కుప్పగా మార్చారని బండి సంజయ్ విమర్శించారు. ప్రతి కుటుంబంపై రూ. 6 లక్షల అప్పు మోపారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు మద్యం ప్రధాన కారణమని… మద్యం వాడకాన్ని నియంత్రించాల్సి ఉందని అన్నారు. ఒక కార్పొరేటర్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడంటూ తనపై కెటిఆర్ విమర్శలు చేస్తున్నాడని… ఆయనకు ట్విట్టర్ టిల్లు అని పేరు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.