ఇప్పటంలో పిచ్చి కల్యాణ్.. పిచ్చికూత‌లు – మంత్రి జోగి ర‌మేష్

ఇప్పటం ఇల్లు కూల్చివేత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూల్చడం ఫై గ్రామస్థులు , ప్రతిపక్షపార్టీలు అధికార పార్టీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ మీటింగ్ కు స్థలం ఇచ్చారనే కోపంతో వైస్సార్సీపీ ఈ దాడికి పాల్పడిందని జనసేన ఆరోపిస్తుంది. ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి ఇల్లు కోల్పోయిన వారికీ ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. కాగా పవన్ ఇప్పటం పర్యటన ఫై వైస్సార్సీపీ నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటంలో పిచ్చి కల్యాణ్.. పిచ్చికూత‌లు కూస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు.

ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా తొలగించలేదన్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు మాత్రమే తొలగించామ‌ని స్ప‌ష్టం చేశారు. రోడ్ల నిర్మాణంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ పనికిమాలిన పిచ్చి కూతలు కూస్తున్నాడని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడని మండిప‌డ్డారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నాడు. పవన్‌ ఇంటి వద్ద రెక్కీ అంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. రెక్కీ నిర్వహించలేదని తెలంగాణ పోలీసులే స్ప‌ష్టంగా చెప్పినా డ్రామాలు ఆడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ లాంటి పనికిమాలిన వ్యక్తులు మా ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదల్చలేరన్నారు. చంద్రబాబు హయాంలో వేల ఇళ్లను, వందల ఆలయాలను కూల్చేశార‌ని మంత్రి జోగి ర‌మేష్ గుర్తుచేశారు. గాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి కూల్చేసిన చరిత్ర చంద్రబాబుద‌న్నారు.

ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో, డ్రైనేజ్ పనుల్లో భాగంగా అడ్డం వచ్చిన చిన్నచిన్న ఆక్రమణలను, ప్రహరీ గోడలను తొలగించడం జరిగిందన్నారు జోగి. ఇప్పటంలోని మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను పగులకొట్టి చెత్తలో పడేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ విగ్రహాలను పంచాయితీ కార్యాలయంలో భద్రంగా ఉంచడమే కాకుండా, వాటిని మళ్లీ ప్రతిష్టించడం జరుగుతుందన్నారు. ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు ఉన్నాయి.. పిచ్చి కల్యాణ్ కారుకూతలు. ఇడుపులపాయ మీదుగా హైవే వేసేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన భీమవరం, గాజువాకల్లో రెండుచోట్ల గెలువలేకపోయావు. ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోని అసమర్థుడివి. ఈ మహానుభావుడు ఇడుపులపాయ మీదగా రోడ్డు వేస్తాడట అంటూ జోగి ఎద్దేవా చేసారు.