నేడు చేవెళ్లలో బిజెపి భారీ సభ..

బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా నేడు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఇప్పటికే బిజెపి శ్రేణులు సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా తెలంగాణ లో కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి కసిగా ఉంది. ఇప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించేందుకు బిజెపి సిద్ధమైంది. అందులో భాగంగానే.. ఈరోజు తెలంగాణలోని చేవెళ్లలో… భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ సభ కోసం 10 రోజుల ముందు నుంచే బీజేపీ వర్గాలు భారీ కసరత్తు చేస్తున్నాయి. సభకు ఎంత మందిని తరలించాలి అనే అంశం మొదలు… సభలో అమిత్ షా ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనే అంశం వరకూ… అన్నింటినీ ఆ పార్టీ లోతుగా విశ్లేషించుకుంటోంది.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా చేవెళ్లకు 6 గంటలకు వెళ్తారు. రాత్రి 7 గంటలకు సభ ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయం వేడెక్కిన తరుణంలో అమిత్ షా పర్యటన మరింత వేడి రాజేస్తోంది.