జనసేన పార్టీ ని నష్టపరిచేందుకు కేసీఆర్ కుట్ర – విజయశాంతి

తెలంగాణ సీఎం బిఆర్ఎస్ పార్టీ తో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల ఫై ఫోకస్ చేస్తూ..ఇతర పార్టీల్లోని కీలక నేతలను బిఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఏపీ జనసేన పార్టీ కీలక నేత తోట చంద్రశేఖర్ తో పాటు పలువుర్ని బిఆర్ఎస్ లోకి ఆహ్వానించి, వారికీ పార్టీ కండువా కప్పారు. అంతే కాకుండా ఏపీలో మరికొంతమందిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ ఫై బిజెపి మహిళ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు.

బీజేపీకి పవన్ ను దూరం చేసేందుకు..ఏపీలో కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆరెస్ రూపంలో కేసీఆర్ చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బిఆర్య్స్ చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే ఏపీలోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసారు. ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసి, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆరెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ట్వీట్‌ చేశారు.