జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని పవన్ దెబ్బతీస్తున్నారుః పేర్ని నాని

చంద్రబాబు తనను సర్వర్ అన్నారని మండిపాటు

perni-nani

అమరావతిః ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపిన షర్మిల… బజారుకెక్కి సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు. జగన్ ను ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనాని పవన్ కల్యాణ్ కు లేదని పేర్ని నాని అన్నారు. తల్లిని తిట్టిన వారి పల్లకీ మోస్తున్న చరిత్ర పవన్ దని విమర్శించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు. పవన్ ను సీఎంగా చూడాలని జనసైనికులు కోరుకుంటుంటే.. ఆయన మాత్రం కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకీ మోయవద్దని పవన్ కు హరిరామజోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు.

జగన్ ఫొటో పెట్టుకుని బాలశౌరి ఎంపీగా గెలిచారని… ఇప్పుడు సిగ్గులేకుండా జగన్ పైనే విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. జంపింగ్ జపాంగ్ బాలశౌరిని పవన్ ఒక వీరుడిలా చూస్తున్నారని అన్నారు. నాదెండ్ల మనోహర్ కాళ్లు పట్టుకుని బాలశౌరి జనసేనలోకి దూరారని చెప్పారు. బాలశౌరిని చంద్రబాబు రిజెక్ట్ చేశారని తెలిపారు. అధికారం, అర్హతను కల్పించిన జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదని చెప్పారు.

టిడిపి అధినేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని… తనను సర్వర్ అని అంటున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెత్తందారుడైన చంద్రబాబుకి సర్వర్లు అంటే అంత చిన్న చూపా? అని మండిపడ్డారు. దుష్ట శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చినా… జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరని అన్నారు.