మళ్లీ కరోనా పంజా..నేడు ప్రధాని మోడీ కీలక భేటి

After new variant scare from China, PM Modi to review Covid situation today

న్యూఢిల్లీః చెనాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. బీఎఫ్-7 వేరియంట్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. మన దేశంలో సైతం ఈ వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ… కొత్త వేరియంట్లపై ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. కోవిడ్ తాజా పరిస్థితులపై ఈరోజు ఆయన ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మోదీతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ, పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మాండవీయ నిన్ననే కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రధాని అధ్యక్షతన అత్యున్నత సమీక్ష జరగనుంది.

మరోవైపు దేశంలోకి కొత్త వేరియంట్లు వస్తుండటం, పండుగల సీజన్ కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెప్పింది. చైనా సహా కరోనా ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మాండవీయ తెలిపారు. గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 129 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఒక్క కరోనా మరణం సంభవించింది. ప్రస్తుతం దేశంలో 3,408 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/