ప్రవళిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం: మంత్రి కెటిఆర్

minister-ktr

హైదరాబాద్‌ః ఇటీవల ప్రవళిక అనే యువతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మొదటగా గ్రూప్-2 వాయిదా పడటం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని చెప్పారు. అయితే తాజాగా ప్రవళిక తల్లిదండ్రులు.. తమ కుమార్తెను ఓ యువకుడు వేధించేవాడని.. అతడి వేధింపులు తట్టుకోలేక తాను బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ప్రవళిక ఆత్మహత్యపై ఇప్పటికే బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్​లు తీవ్రంగా స్పందించాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు.. ఆమెది ఆత్మహత్య కాదని.. ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించాయి. మరోవైపు యువతి మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ బిఆర్ఎస్ హితవు పలికింది. అయితే తాజాగా కరీంనగర్​లో పర్యటించిన మంత్రి కెటిఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు.

“ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారు. ప్రవళిక కుటుంబసభ్యులు నా దగ్గరకు వచ్చారు.. న్యాయం చేయాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటాం. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం. అంతే కాకుండా ఆ అమ్మాయిని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తపడతాం.” అని కెటిఆర్ తెలిపారు.