పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న వైస్సార్సీపీ నేతలు

ఏపీలో తాజాగా పవన్ కళ్యాణ్ రెండవ విడత వారాహి విజయయాత్రలో వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ మ‌హిళా వాలంటీర్ల‌ను అవ‌మానించాడ‌ని మంత్రి వేణుగోపాలకృష్ణ మండిప‌డ్డారు. ఏలూరు వారాహియాత్ర సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. మహిళలకు పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందని అన్నారు. వాలంటీర్లను జనం తమ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారని, పవన్ కళ్యాణ్‌ను జనం క్షమించరని ఆయన అన్నారు.

జగన్ ను రాజ‌కీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప‌వ‌న్ క‌ళ్యాణ్ విషం చిమ్ముతున్నార‌ని మాజీ మంత్రి ఆళ్ల‌నాని మండిప‌డ్డారు. వారాహి యాత్రలో పవన్ దుష్ర్పచారం చేశారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై, సమస్యలపై పవన్‌కు కనీస అవగాహన లేదన్నారు. ఏలూరు నియోజకవర్గ జనసేన సభకు జిల్లా నలుమూలల నుంచి జనాన్ని తరలించారన్నారు. ఏలూరులో సమస్యలపై తమ్మిలేరు రక్షణ గోడను వైయ‌స్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించామన్నారు. దశాబ్దన్నర కాలం పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏనాడూ తమ్మిలేరు ముంపుపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు ఆసుపత్రికి జీవం పోసి, మెడికల్ కాలేజీ తీసుకొచ్చామని ఆళ్ల నాని తెలిపారు. వైస్సార్సీపీ పాలనలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మిస్తుంటే.. దానిపై అసత్య ప్రచారం చేయడం తగదని అన్నారు. కుట్రపూరితంగా అసత్యాలు చెప్పి, ఏలూరు ప్రజలను పవన్ మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

మహిళలంటే పవన్‌కు గౌరవం లేదని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ మండిప‌డ్డారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రజానీకం వాలంటీర్‌ వ్యవస్థను కొనియాడుతోందని గుర్తు చేశారు. కరోనా సమయంలో పవన్‌ ఫాంహౌజ్‌లోనే పడుకున్నాడని, వాలంటీర్ల మాదిరి ప్రజలకు సేవ చేయలేదని విమర్శించాడు. వాలంటీర్లలో ఎక్కువశాతం మహిళలే ఉన్నారని చెప్పారు.