ఆ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను..విజయసాయిరెడ్డి

ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడ‌లేద‌న్న విజ‌య‌సాయిరెడ్డి

న్యూఢిల్లీ: రాజ్యసభలో నిన్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. స‌భ‌ చైర్మన్ వెంక‌య్య నాయుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. వెంక‌య్య నాయుడి మనసు బిజెపితో, తనువు టిడిపితో ఉన్నాయని, ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి ఈ రోజు ఉద‌యం రాజ్య‌స‌భ‌లో స్పందించారు.

రాజ్యసభ చైర్మ‌న్‌పై తాను చేసిన‌ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాన‌ని విజయసాయి రెడ్డి తెలిపారు. తాను చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల చింతిస్తున్నాన‌ని అన్నారు. ఇటువంటి వ్యాఖ్య‌లు పునరావృతం కాకుండా చూసుకుంటాన‌ని, తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడ‌లేద‌ని చెప్పారు.

తాను నిన్న‌ ఆవేశంలోనే అలా మాట్లాడాన‌ని, రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదని తెలిపారు. కాగా, విజ‌య‌సాయిరెడ్డి ఈ రోజు రాజ్య‌స‌భ‌లో మాట్లాడ‌డానికి ముందు ఆయ‌న‌ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మందలించారు. నిన్న ఆయ‌న చేసిన వ్యాఖ్యలు సరికాద‌ని అన్నారు. రాజ్యసభ చైర్మన్ పట్ల త‌నకు చాలా గౌరవం ఉందని, నిన్న జరిగింది నిందించదగినదని చెప్పారు. వెంక‌య్య నాయుడికి క్షమాపణలు చెప్పాలని అన్నారు.

కాగా, అనంత‌రం రాజ్య‌స‌భ‌లో విజ‌య‌సాయిరెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప‌లు అంశాల‌పై కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఈ విష‌యాల‌ను తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద అమలుకాని హామీలైన స్టీల్‌ ప్లాంట్‌, పోర్టు వంటి మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు బదులుగా జాతీయ పైప్‌లైన్‌ మౌలిక వసతుల ప్రాజెక్ట్‌ కింద ఏపీని చేర్చే ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా? అని ఈ రోజు రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిని ప్రశ్నించడం జరిగింది’ అని ఆయ‌న చెప్పారు.