డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి – యోగి

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగాయని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ఆధ్వర్యంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణలో బారాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేశాడని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయి కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని, తెలంగాణ మాత్రం అభివృద్ధి చెందలేదని అన్నారు.

తెలంగాణలో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చాక అవినీతిపరుల ఆట కట్టిస్తుందని..బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని… ప్రజల భవిష్యత్తు కోసం శ్రమిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పెట్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి తెలగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే… నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే అన్నారు. తెలంగాణలో పరీక్ష పత్రాలు లీకై ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఎన్నికల్లో యువకులు తెలంగాణ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. కార్పొరేట్ ఎన్నికల్లో నగరానికి వచ్చాయని, అప్పుడు బీజేపీ కార్పొరేటర్లు గెలిచి హైదరాబాద్లో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు.