ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికిన జగన్

తిరుమల పర్యటన లో భాగంగా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్న ప్రధాని మోడీ నేడు తిరుపతి కి చేరుకున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలోరేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు ఏపీ సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, బిజెపి నాయకులు, వైయస్సార్సీపి ఎంపీలు ఎమ్మెల్యేలు, అధికారులు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయటలుదేరిన ప్రధాని మరికాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు.

ప్రధాని రెండు రోజుల తిరుమల పర్యటన నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర బలగాలతోపాటు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తు చేపట్టారు. మోదీ వెంట గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ రానుండగా.. తిరుమల వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని బసచేసే శ్రీరచనా గెస్ట్‌హౌస్ సహా ప్రముఖులు ఉండే అతిథిగృహాలను ఇప్పటికే ఎన్‌ఎస్‌జీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అలాగే, ప్రధాని ప్రయాణించే మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శించుకున్నారు. 2023 నాలుగో పర్యాయం మోదీ తిరుమలకు వస్తున్నారు. ప్రధాని మోదీ తిరుమల, తిరుపతి పర్యటన క్రమంలో కాన్వాయ్ ట్రైలర్ శనివారం రాత్రి నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలలోని రచన గృహం వరకు. అటు తరువాత శ్రీవారి ఆలయం వరకు ట్రైల్ రన్ కొనసాగింది. ఇప్పటికే అటు కేంద్ర ఇటు రాష్ట్ర పోలీసు బలగాలు తిరుమలను జల్లెడ పట్టారు.

సోమవారం ఉదయం 7:55 గంటలకు శ్రీవారిని ఆలయానికి చేరుకుని, మహాద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తారు. ఉదయం 8.05 గంటలకు స్వామిని దర్శించుకుని 8:45 గంటల వరకు ఆలయంలోనే ప్రధాని గడపనున్నారు. దర్శనం అనంతరం.. వేద పండితుల ఆశీర్వాదాలు, ప్రసాదం స్వీకరించి 8:55 గంటలకు బయటకు వస్తారు. అక్కడ నుంచి తిరిగి శ్రీరచనా అతిధి గృహానికి చేరుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మళ్లీ ఉదయం 9:30 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.