నేడు విజయవాడలో ఎత్తైన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం

విజయవాడలో అత్యంత ఎత్తైన డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సీఎం జగన్ చేతుల మీదుగా జరగనుంది. విజయవాడలోని స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది. సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించినా ప్రజలకు మాత్రం స్మృతి వనాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని వీక్షించేందుకు రేపటి నుంచి అనుమతివ్వనున్నారు. దాదాపు 18 ఎకరాల స్థలంలో 125 అడుగల ఎత్తుతో రూ.404 కోట్ల నిధులతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహం తయారికి దాదాపు 400 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగించారు.

మూడేళ్ల నుంచి ఈ విగ్రహ నిర్మాణం జరుగుతుంది. ఈ విగ్రహ నిర్మాణానికి 404.35 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని భావించిన ప్రభుత్వం అందుకు విజయవాడ నడిబొడ్డులో ఉన్న స్వరాజ్ మైదానం అయితే బెటర్ అని భావించి చర్యలు చేపట్టింది. ఈ అద్భుతమైన ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు.