ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఎలాన్ మస్క్ ప్ర‌క‌ట‌న‌

ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఎలాన్ మస్క్ ప్ర‌క‌ట‌న‌ చేసారు. కొన్ని రోజుల క్రితం టెస్లా అధినేత, ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం 44 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు డీల్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు మ‌స్క్ తాజాగా ప్ర‌క‌టించారు. స్పామ్‌, ఫేక్ అకౌంట్ల‌పై స‌మ‌గ్ర‌మైన స‌మాచారాన్ని ట్విట‌ర్‌ ఇవ్వ‌లేక‌పోయింద‌ని, అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలుతున్న‌ట్లు మ‌స్క్ తెలిపారు.

కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని గత కొంత కాలంగా మ‌స్క్ చెబుతూ వస్తున్నారు. ట్విట్టర్ చెప్పిన దానికంటే స్పామ్‌ ఖాతాలు నాలుగింతలు అధికంగా ఉన్నాయంటున్న ఆయన.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం కచ్చితమైనదని భావించే తాను కొనుగోలు ఒప్పందానికి అంగీకరించానని గతంలో పేర్కొన్నారు. ఆ విషయం తేలేవరకు కొనుగోలు ఒప్పందం ముందు వెళ్లదని ఎలాన్‌ మస్క్‌ పలుమార్లు స్పష్టం చేశారు.

మ‌స్క్‌తో అంగీక‌రించిన ఒప్పందాన్నినిబంధ‌న‌ల ప్ర‌కారం ర‌ద్దు చేయ‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని ట్విట్ట‌ర్ బోర్డ్ చైర్మెన్ బ్రెట్ టేల‌ర్ తెలిపారు. కాగా.. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్ర‌కారం ఏదైనా కార‌ణం వ‌ల్ల మ‌స్క్ లావాదేవీని పూర్తిచేయ‌క‌పోయినా, ఒప్పందాన్నిర‌ద్దు చేసుకున్నా 1 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఫెనాల్లీ కింద ట్విట‌ర్‌కు చెల్లించాల్సి ఉంటుంది.