జైల్లో పెడితే వైఎస్ షర్మిల భయపడే రకం కాదు – వైస్ విజయమ్మ

చంచల్ గూడ జైల్లో ఉన్న షర్మిల ను వైస్ విజయమ్మ పరామర్శించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ..జైల్లో పెడితే వైఎస్ షర్మిల భయపడే రకం కాదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఎందుకు ప్రశ్నిస్తుందనే విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రూపు ప్రశ్నా పత్రాల లీకేజీ, పదో తరగతి ప్రశ్న పేపర్ లీక్ వ్యవహారంలో గళం ఎత్తుతుంటే ప్రభుత్వం అణచివేస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని ప్రభుత్వం అనుకుంటే, రేపటి నాడు ప్రజలు, యువకులే ప్రభుత్వానికి సమాధానం చెబుతారని అన్నారు. ఇలాంటి పనులకు వైఎస్ షర్మిల భయపడే రకం కాదని అన్నారు. ప్రజలకు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను చేరువ చేయాలనే లక్ష్యంతో షర్మిల పోరాడుతోందని , అందుకే వేలాది కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు.

ఒక ఆడపిల్ల 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేసింది. ప్రజల కోసం ఇన్ని ప్రశ్నలు వేస్తుందనే దురుద్దేశంతోనే అరెస్టు చేశారు. ఇంకో రోజులో పాదయాత్ర ముగుస్తుందనగా కూడా అరెస్టు చేశారు. ఇది ఐదోసారి అరెస్టు చేయడం. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా? సిట్ ఆఫీసుకు వెళ్తే ఏమవుతుంది? ఆమె వేలాది మందితో వెళ్లట్లేదు. ఉద్యమకారిణి, టెర్రరిస్టు కాదు కదా? కాంగ్రెస్, బీజేపీలకు అన్ని అనుమతులు ఇస్తున్నారు. షర్మిలకు ఎందుకు బయటికి పోనివ్వడం లేదని విజయమ్మ ప్రశ్నించారు.

సోమవారం పోలీసులపై దాడి కేసులో వైఎస్‌ షర్మిలను అరెస్ట్ చేసి , ఆమె ఫై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల సహా ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు. మే 8వ తేదీ వరకు షర్మిల జ్యూడీషియల్ రిమాండ్ కొనసాగుతుంది.