ఆన్‌లైన్‌ గేమ్‌ ఓ కుటుంబాన్ని బలితీసుకుంది

స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని పెద్దవారి దగ్గరి నుండి చిన్న పిల్లల వరకు ఆన్‌లైన్‌ గేమ్స్ కు అలవాటుపడ్డారు. అయితే కొంతమంది టైం పాస్ కోసం గేమ్స్ ఆడితే..మరికొంతమంది డబ్బు సంపాదన కోసం ఆడుతుంటారు. ఆలా ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులపాలై చివరకు తన భార్య పిల్లలతో ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

పెరుంగుడి పెరియార్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉండే మణికంఠన్‌ (36) కోయంబత్తూర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.. అయితే, రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ నగదు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వస్తున్నాడు. ఇలా ఆఫీస్ కు వెళ్లకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నావు ఎందుకు అంటూ భార్య అతడితో గొడవపడుతూ వస్తుంది. అయినప్పటికీ మణికంఠన్‌ తీరు మారలేదు. భార్య మాటలు పట్టించుకోకుండా అలాగే ఆడుతూ వస్తున్నాడు. చివరకు అప్పులపాలయ్యాడు. అప్పులు ఎక్కువ కావడంతో ఏంచేయాలో తెలియక.. చివరకు భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తంగా.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ అప్పులపాలుచేసి.. మణికంఠన్‌ (36), తార (35), ధరణ్‌ (10), దహాన్‌ (1) ప్రాణాలు తీశాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.