సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

తెలంగాణ లో త్వరలోనే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టబోతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య జనవరిలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాగా, మరొకటి సికింద్రాబాద్ మధ్య ఏప్రిల్ నెలలో పట్టాలెక్కింది. మూడోది సికింద్రాబాద్-పుణె మధ్య ఉంటుందని అనుకున్నారు. కానీ, అంతకుముందు సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు నగరాలకు వందేభారత్ రైలును నడిపేందుకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య 581 కిలోమీటర్ల దూరంగా ఉండగా.. ఈ రెండు మార్గాల మధ్య ప్రయాణ సమయం 11 గంటలుగా ఉంది. ఈ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే రెండు నగరాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత దృఢంగా మారుతాయని మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఇటీవల రైల్వే శాఖ మంత్రిని కలిసిన సమయంలో కోరారు. ఈ క్రమంలోనే వందేభారత్ రైలుకు సంబంధించిన తాత్కాలిక టైం టేబుల్ రైల్వే అధికారులు రూపొందించారు.