యూపీలో పెను రైలు ప్రమాదాన్ని ఆపిన రైతు

దేశ వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు జరుగగా..తాజాగా యూపీలో మరో ప్రమాదం జరగకుండా ఓ రైతు అడ్డుకున్నాడు. ప్రయాగ్‌రాజ్‌ నుంచి లక్నో వెళ్తున్న గంగా గోమతి ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది.

లాల్‌గోపాల్‌గంజ్ రైల్వే స్టేషన్ తూర్పు క్యాబిన్ సమీపంలో పిల్లర్ నంబర్ 26/6 దగ్గర.. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో రైలు వచ్చిన వెంటనే ఒక వ్యక్తి టవల్ ఊపడం ప్రారంభించాడు. రైలు డ్రైవర్ దృష్టి అతని వైపు ఉండేలా రైలు మార్గంలో ముందుకు వెనుకకు కదలడం ప్రారంభించాడు. ప్రమాదాన్ని గుర్తించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. దీని తరువాత లాల్‌గోపాల్‌గంజ్‌లోని భోలా కా పురా గ్రామానికి చెందిన రైతు బాబు మాట్లాడుతూ.. ఇక్కడ రైల్వే ట్రాక్ విరిగిపోయిందని..అందుకే ఆలా ఎర్రటి టవల్ ఊపినట్లు తెలిపాడు. ట్రాక్‌పై జాగ్రత్తలు పాటిస్తూ రైలును నెమ్మదిగా ముందుకు కదిలించారు. రైలు ట్రాక్‌లో పగుళ్లు ఏర్పడటం సాధారణ ప్రక్రియ అని ఉత్తర రైల్వే, లక్నో డివిజన్ ఎడిఆర్‌ఎం అశ్విని శ్రీవాస్తవ తెలిపారు..