ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. అతడు ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ముష్కరుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.

మరో ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్టును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ముష్కరుల కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/