పుతిన్‌పై ప్రైవేటు ఆర్మీ ‘వ్యాగ్నర్ గ్రూప్’ తిరుగుబాటు

రష్యా మిలిటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని భీషణ ప్రతిజ్ఞ

Wagner chief accuses Russian military leadership of bombing his forces, vows response

మాస్కోః ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిరిగింది. ఇంతకాలం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వెన్నుదన్నుగా నిలిచిన ప్రైవేటు ఆర్మీ ‘వ్యాగ్నర్ గ్రూప్’ సంచలన ప్రకటన చేసింది. రష్యా మిలిటరీ నాయకత్వాన్ని గద్దె దించుతామంటూ భీషణ ప్రతిజ్ఞ చేసింది. మాస్కో వైపు తమ దళాలు కదులుతున్నాయని, తమదారికి అడ్డువచ్చే వారిని నాశనం చేస్తామని శనివారం ప్రకటించింది. ‘‘మేము ముందు కెళుతున్నాం. చివరి కంటా వెళతాం’’ అంటూ వ్యాగ్నర్ గ్రూప్ అధినేత యవ్జినీ ప్రిగోజిన్ పేర్కొన్నారు. తమ దళాలు ఇప్పటికే రష్యా దక్షిణ ప్రాంతంలోని రోస్తోవ్‌ నగరంలోకి ప్రవేశించాయని చెప్పుకొచ్చారు. కానీ, తన ప్రకటన రుజువు చేసే ఆధారాలేవీ బయటపెట్టలేదు.

గత కొంతకాలంగా ప్రిగోజిన్‌కు, రష్యా రక్షణ శాఖకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. తమ దళాలపై రష్యా మిసైళ్లతో దాడికి దిగిందని శుక్రవారం ఆయన సంచలన ఆరోపణ చేశాడు. ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు. రష్యా ప్రభుత్వంపై తమ తిరుబాటులో పాలుపంచుకోవాలని రష్యన్లకు ఆయన పిలుపునిచ్చాడు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వానికి ఇది పెను సవాలేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ రష్యాకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్‌ దళాలపై భీకర దాడులు చేసింది.