అక్కడ రేషన్ షాప్స్ లలో టమోటో కేజీ రూ.60

టమాటా ఈ పేరు పలకాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. నెల క్రితం వరకు కేజీ టమాటా రూ.20 ఉండగా .. క్రమక్రమంగా ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం వారం నుండి ఏకంగా రూ.100 పలుకుతుంది. కొన్ని షాపుల్లో అయితే రూ.120 కి విక్రయిస్తున్నారు. టమాటా ధర వందకు చేరడం తో వాటిని కొనేందుకు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కేజీ తీసుకునే దగ్గర పావుకేజీ తీసుకొని సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అసలు టమాటా వైపు చూసేందుకు కూడా భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాయగూరల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం గమనించి.. రోజూ ఎక్కువగా వినియోగించే టమాటాలను అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దాదాపు 50% మేర ధరలు తగ్గించింది. రేషన్ షాప్‌లలో మాత్రమే ఇది వర్తిస్తుంది. బియ్యం, పప్పు, నూనె ఎలాగైతే రేషన్ షాప్‌లలో చౌక ధరలకు లభిస్తాయో అలాగే టమాటాలనూ తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. చెన్నైలోని రేషన్ దుకాణాల్లో కిలో రూ.60కే విక్రయిస్తోంది. ముందుగా చెన్నైలోని రేషన్ షాప్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తరవాత రాష్ట్రవ్యాప్తంగా ఇది అమలు చేస్తామని స్టాలిన్ ప్రభుత్వం తెలిపింది.