అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో APSRTC బస్సు బోల్తా పడింది. తెల్లవారు జామున జంగారెడ్డి గూడెం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు..కసింకోట వద్ద జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం లో దాదాపు 30 మందికి గాయాలు అయ్యాయి. పెద్ద ప్రమాదం జరుగకపోవడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీకొని అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. బస్సు డ్రైవర్ తప్పిదం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసారు. గాయపడిన వారిని స్థానిక హాస్పటల్ లో చేర్పించారు.

అలాగే హైదరాబాద్ లోను మరో TSRTC బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్‌ శివారులోని పెద్ద అంబర్‌పేట్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. అయితే ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే అలర్ట్‌ అయ్యాడు. అప్రమత్తతతో వ్యవహరించి ప్రయాణికులందరినీ కిందకు దించేసి, ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉండగా అందరూ క్షేమంగా బయటపడ్డారు.