కలుషితాహారం తిని 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

వనపర్తి జిల్లా అమరచింత కేజీబీవీలో ఘటన

amarachintha-kgbv-girls-fell-ill-after-having-dinner

వనపర్తిః కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థుల్లో 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వనపర్తి జిల్లా అమరచింతలో జరిగిందీ ఘటన. గురువారం రాత్రి సాంబారు, వంకాయ కూరతో భోజనం చేసి నిద్రపోయిన బాలికలు అర్ధరాత్రి లేచి వాంతులు చేసుకున్నారు. కడుపులో మంటతో విలవిల్లాడిపోయారు.

రాత్రి ఒకే ఒక్క టీచర్ ఉండడంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. ఉదయానికి వారి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి 40 మంది విద్యార్థులను మరింత మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించనున్నారు.