కిలో టమాటా రూ.30 పైసలే

నెల క్రితం వరకు టమాటా ధర ఆకాశానికి తాకింది..కానీ ఇప్పుడు ధర లేక రైతులు నేలపై పారబోసి వెళ్తున్నారు. టమాటా ధర గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పలికింది. రెండు నెలల్లో టమాటా పండించిన రైతులు కోటేశ్వర్లు అయ్యారు. కిలో టమాటా రూ. 300 వరకు పలికింది. దీంతో సామాన్య ప్రజలు టమాటా కొనేందుకు కాదు చూసేందుకు కూడా భయపడ్డారు. దాదాపు రెండు నెలల వరకు టమాటా ధర అదే రేంజ్ లో ఉంది.

ఇక నెల నుండి తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకూ మార్కెట్‌లో రూ.200 పలికిన కిలో టమాటా.. నేడు ధరలు లేక వెలవెలబోతోంది. కనీసం రవాణా ఛార్జీలు రావడం కూడా గగనంగా మారడంతో పంటను రోడ్డుపై పారబోసే పరిస్థితి నెలకుంది. తాజాగా, నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు తాము తీసుకొచ్చిన టమాటాలను అక్కడే పారబోసి వెళ్లిపోయారు. దీంతో వాటిని పశువులు మేస్తూ కనిపించాయి.

ధరలు భారీగా పతనమయ్యాయని, పంట కోత, రవాణా ఖర్చులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్‌లో కిలో టమాటా రూ.3 పలికితే.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో ధర భారీగా పతనమయ్యింది. 25 కిలోల టమాటా బాక్సు రూ.10 నుంచి రూ.35 వరకూ పలుకుతుండటం గమనార్హం. అంటే కేజీ టమాటా దాదాపు 30 నుంచి 40 పైసలే. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై టమాటాలను రైతులు పారబోస్తున్నారు.