ఓటమి భయం వల్లే రెండు చోట్ల పోటీ అనడం హాస్యాస్పదం: ఎమ్మెల్సీ కవిత

రాజకీయాల్లో సంయమనం అవసరమని మైనంపల్లికి సూచన

there-is-a-strategy-behind-cm-kcr-contesting-in-kamareddy-says-kavitha

హైదరాబాద్‌ః ఓటమి భయం వల్లే సిఎం కెసిఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారన్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా నామినేషన్ వేసి గెలిచిన నాయకుడు కెసిఆర్ అన్నారు. కామారెడ్డిలో పోటీ చేయడం వెనుక ఓ వ్యూహం ఉందని కవిత స్పష్టం చేశారు. రాజకీయాల్లో సంయమనం అవసరమని, బాధ్యతతో ఉండాలంటూ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు సూచించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. ఆయన సీటు మార్పుపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇక, మహిళా బిల్లుపై స్పందించని నాయకులంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్లపై స్పందించారని కవిత అన్నారు. ప్రతీ పార్టీ నుంచి అనేక మంది నాయకులు నిన్న తనను తూలనాడారంటూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇది కేవలం టికెట్ల పంచాయితీ మాత్రమే కాదని, మహిళా బిల్లు తన వ్యక్తిగత విషయం కాదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పురుషాధిక్యత ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నా బిజెపి అధికారంలో ఉన్న యూపీలోనే అమలవడం లేదని విమర్శించారు. మాజీ ప్రధాని నెహ్రూ కేబినెట్‌లో ఒక్క మహిళ, మోడీ కేబినెట్‌లో కేవలం ఇద్దరు మహిళా మంత్రులు మాత్రమే ఉన్నారని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని కవిత ప్రశ్నించారు. డిసెంబర్‌లో మళ్లీ ఢిల్లీలో ధర్నా చేపడుతానని.. అప్పుడు సోనియా గాంధీ, డీకే అరుణలకు ఆహ్వానం పంపిస్తానని కవిత చెప్పారు. ఎంపీ అర్వింద్ కామెంట్లపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.