కూతురు ఎదుగుదలను చూసి మురిసిపోయిన జగన్

కూతురు ఎదుగుదలను చూసి మురిసిపోయాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. జగన్-భారతి దంపతుల పెద్దకుమార్తె హర్ష పారిస్‌లోని ప్రఖ్యాత బిజినెల్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దీనికి సంబంధించి క్యాంపస్‌లో కాన్వొకేషన్ ఈరోజు జులై 2న జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరయ్యారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసిన జగన్.. ‘‘డియర్ హర్షా.. నీ ఎదుగుదలను చూడటం అద్భుత ప్రయాణం. దేవుడు ఎంతో దయ చూపాడు. ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్‌లో నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం నాకు గర్వకారణం. నీకు దేవుడు అంతా మంచి చేయాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు. హర్షా రెడ్డి, భారతితో కలిసి దిగిన ఫొటోను జగన్ షేర్ చేశారు.

జగన్ ఇంగ్లిష్‌లో చేసిన ఈ ట్వీట్ కాసేపటికే వైరల్ అయ్యింది. హర్షా రెడ్డికి జగన్ అభిమానులు కామెంట్ల రూపంలో కంగ్రాట్స్ చెబుతున్నారు. కొందరు అభిమానులు జగన్ పారిస్‌లో నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్‌కు మంత్రి రోజా స్పందించారు. కంగ్రాట్స్ హర్షా అంటూ.. జగన్ కుమార్తెను ఆమె అభినందించారు. ఇక రేపు జగన్ రాష్ట్రానికి తిరిగిరానున్నారు.