ABVP కార్యకర్త జుట్టు పట్టుకుని లాగిన కానిస్టేబుళ్లు..ప్రజలు ఆగ్రహం

ABVP మహిళా కార్యకర్తపై HYD పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూముల జీవో నెం.55 వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏబీవీపీ నేతలు మద్దతిస్తూ నిరసన చేపట్టారు. ఇందులో పాల్గొన్న ఓ కార్యకర్తను బైక్ ఫై వెంబడించిన లేడీ కానిస్టేబుళ్లు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో దీనిపై సర్వత్రా విమర్శలు కురుస్తున్నాయి.

సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ విద్యార్థిని ఏం అడిగింది? యూనివర్సిటీకి చెందిన భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని కోరింది. ఇందులో ఆమెకు సొంతంగా ఒనగూరేది ఇసుమంతైనా ఉన్నదా? లేదు. రేపటి తరానికి భరోసానిచ్చేలా వ్యవసాయ యూనివర్సిటీ ఉండాలనేదే ఆమె ఆకాంక్ష. ఎవరైనా తమ నిరసన తెలుపవచ్చని సీఎం రేవంత్‌ చెప్తూనే ఉన్నారుగా! మరి ఈ ప్రకటనకు తగ్గట్టు పరిస్థితులు ఉన్నాయా? లేనేలేవు. అమ్మాయి అని కూడా చూడకుండా గొరగొర ఈడ్చుకెళ్లటమా?’ అని ధ్వజమెత్తారు. అలాగే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు.