వీసా లేకుండానే భారత పౌరుల పర్యటనకు థాయ్‌లాండ్ గ్రీన్‌సిగ్నల్

నవంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఆఫర్

Thailand Now Grants Visa-Free Entry to Indians

బ్యాంకాక్ : థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఆ దేశం గుడ్‌న్యూస్ చెప్పింది. వీసా లేకుండానే భారతీయులను ఆహ్వానించే దేశాల సరసన థాయ్‌లాండ్ కూడా చేరింది. పర్యాటక రంగానికి ఊతమివ్వడమే లక్ష్యంగా భారత్, తైవాన్ దేశాల పౌరులు వీసా లేకుండానే పర్యటించే అవకాశం కల్పించింది. ఇందుకు అనుమతినిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10 నుంచి వచ్చే సంవత్సరం మే 10 వరకు ఈ వెసులుబాటు భారతీయులకు అందుబాటులో ఉంటుంది. 30 రోజులపాటు వీసా లేకుండానే అక్కడ గడపొచ్చు.

ఈ మేరకు ప్రధాని శ్రేట్టా థవిసిన్ నేతృత్వంలోని థాయ్‌లాండ్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోకి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. మలేసియా, చైనా, దక్షిణకొరియా దేశాల తర్వాత భారత్ నుంచే థాయ్‌లాండ్‌కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక గడిచిన నెలలో చైనా పౌరులకు వీసా రహిత పర్యటనకు థాయ్‌లాండ్ అవకాశం కల్పించింది. మరోవైపు ఇటీవలే శ్రీలంక కూడా భారత పౌరులకు వీసా లేకుండానే దేశంలో పర్యటించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.