జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రభస

trs-and-bjp-comments-in-ghmc-meeting

హైదరాబాద్ః జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన సమావేశమైన పాలక మండలి వాడివేడీగా వాదోపవాదాల మధ్య గందరగోళంగా సాగడంతో ఐదు నిమిషాల పాటు మేయర్ సభను వాయిదా వేశారు. మొదటగా తెలంగాణ సాయుధ పోరాటయోధులకు సభ నివాళులర్పించింది. నివాళులర్పించే ముందు సమైక్యత దినోత్సవం కాదని.. విమోచన దినోత్సవంటూ బిజెపి కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే నరకమేనని.. అధికారంలో ఉండి ఏం అభివృద్ది చేశారో వర్షం వస్తే తెలుస్తోందని ఉప్పల్ కార్పొరేటర్ రజిత ఎద్దేవా చేశారు. ఎస్‌ఎన్‌డీపీ కింద జరుతున్న పనులు నత్త నడక సాగుతున్నాయనే విషయంలో సమావేశంలో రగడ మొదలైంది. ఈ పనుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు.

బంజారాభవన్‌, కొమురం భీం భవన్‌ నిర్మాణాలపై టిఆర్‌ఎస్‌ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలపడంపై బిజెపి కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను భజన కార్యక్రమంగా మారుస్తున్నారని ఆందోళన చేశారు. టిఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ల అంశంపై కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో బిజెపి కార్పొరేటర్లు మేయర్ పొడియాన్ని చుట్టుముట్టారు. టిఆర్‌ఎస్‌ సిద్దాంతాలు నచ్చే వారు చేరారని బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తెలిపారు. దీనికి భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మేయర్ సభను ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు. పది నిమిషాల తర్వాత యథావిధిగా సభను నిర్వహించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/