మరో రైలు ప్రమాదం .. పట్టాలు తప్పిన సుహైల్‌దేవ్ ఎక్స్ ప్రెస్

మూడు రోజుల క్రితం విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన గురించి ఇంకా మాట్లాడుతుండగానే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వద్ద సుహైల్‌దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఇంజిన్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ప్రయాణికులెవరూ గాయపడలేదు. ట్రాక్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తక్షణ మరమ్మతు పనులు చేపట్టారు.

ఆనంద్ విహార్- ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ సిటీ స్టేషన్ల మధ్య నడిచే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. నిన్న సాయంత్రం ఆనంద్ విహార్ నుంచి 6:50 నిమిషాలకు బయలుదేరింది. మరుసటి ఉదయం 9:30 గంటలకు ఘాజీపూర్ సిటీ స్టేషన్ చేరాల్సి ఉంది. మార్గమధ్యలో ప్రయాగ్ రాజ్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు నెమ్మదిగ్గా వెళ్తోండటం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో ప్లాట్ ఫామ్ నంబర్ 6 ట్రాక్ కొంతమేర దెబ్బతింది. రైల్వే సిబ్బంది తక్షణమే మరమ్మతు పనులు చేపట్టారు.