ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా తగ్గిందన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న హెల్త్ డైరెక్టర్

telangana-health-director-srinivasa-rao-controversial-statement-on-corona

హైదరాబాద్‌ః ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని, కేవలం ఏసు ప్రభువు కృప వల్లే కరోనా తగ్గిందని ఆయన అన్నారు. మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని చెప్పారు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవులు లేకపోతే ప్రపంచ దేశాల్లో భారత్ మనుగడ సాగించేది కాదని అన్నారు.

కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో, ఆయన తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని శ్రీనివాసరావు అన్నారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి వివాదాన్ని సృష్టించాయని అసహనం వ్యక్తం చేశారు. దీన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంపూర్ణ సహకారం, ఇతర శాఖల మద్దతుతోనే కరోనాను నియంత్రించగలిగామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/