కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు అశాస్త్రీయమైనవి – పర్యావరణ వేత్తలు

కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు అశాస్త్రీయమైనవన్నారు పర్యావరణ వేత్తలు. భద్రాచలం పర్యటన లో సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ కామెంట్స్ ఫై ఇప్పటికే పలు రాజకీయపార్టీల నేతలు తప్పుపట్టగా..క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ కుట్ర ఉన్నట్లు కేసీఆర్ ఆధారాలిస్తే భారత ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఈ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలఫై పర్యావరణ వేత్తలు స్పందించారు.

కేసీఆర్ చెప్పినట్లుగా క్లౌడ్‌ బరస్ట్‌ చేసే టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఆయన వ్యాఖ్యలు అశాస్త్రీయమైనవని పర్యావరణ వేత్తలు పేర్కొన్నారు. ‘క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ డిజాస్టర్స్‌ ఎక్స్‌ట్రీమ్‌ వెదర్‌ ఈవెంట్స్‌ ఇన్‌ తెలంగాణ’ అంశంపై సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పర్యావరణవేత్తలు డా.దొంతి నర్సింహారెడ్డి, డా.సుబ్బారావు, డా.ఎన్‌.సాయిభాస్కర్‌రెడ్డి, ఆర్‌.దిలీప్‌రెడ్డి మాట్లాడారు. వాతావరణ మార్పులతో వచ్చే వర్షాలను ఎల్‌నినో(చిన్నది), లానినో(పెద్దది)గా పిలుస్తారని తెలిపారు. లానినోలో తక్కువ రోజుల్లో అధిక వర్షపాతం నమోదవుతుందన్నారు. జూన్‌ 5కల్లా రావాల్సిన వర్షాలు జులైలో ప్రారంభమై వరదలు వచ్చాయని పేర్కొన్నారు.

ఆకస్మిక వరదలతో ముంపునకు గురైన తెలంగాణలోని ప్రాంతాలు బయట పడేందుకు మరో రెండు వారాల సమయం పట్టొచ్చని, ఇలాంటి విపత్తు మరోసారి వచ్చే అవకాశముందని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. గతంలో పోలిస్తే తెలంగాణలో నీటి వనరులు భారీగా పెరిగాయని, ఆంధ్రా మాదిరిగా తేమ శాతం కూడా పెరిగిందని తెలిపారు. వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో సమీక్ష నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.