విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు చేసారు. దేవాదాయశాఖలో రెవెన్యూ అధికారుల పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు. 17 ఏళ్లుగా పదోన్నతి రాకపోవడం దేవాలయ ఉద్యోగుల దౌర్భాగ్యమన్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులను ఆలయాలకు ఈవోలుగా వేయడమేంటి? అని ప్రశ్నించారు. దేవాలయ ఉద్యోగుల చేతకానితనంగానే భావించాలన్నారు. అంతర్గత కలహాలతో అధికారులు దేవాదాయ శాఖను భ్రష్టుపట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారని.. పెరుగుతున్న భూవివాదాలు, భూ కబ్జాల దృష్ట్యా దేవాదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమే అని అభిప్రాయపడ్డారు. అలాగని దేవాదాయశాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉందని.. 12 ఏళ్ళుగా దేవాదాయ శాఖలో ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు స్వామీజీ. కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. అలా వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లు పరిస్థితి ఉందని.. రెవెన్యూ అధికారుల నియామకాన్ని తొలినుండే వ్యతిరేకిస్తూనే ఉన్నానన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు చర్చ కు దారితీసాయి.