పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మే 2న నోటిఫికేషన్ ఇవ్వనుంది. మే 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ, మే 27న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. జూన్ 5న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీగా ఏర్పడిన స్థానంలో ఈ ఉపఎన్నిక జరగనుంది.
ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి గత డిసెంబరు 9న రాజీనామా చేశారు. ఖాళీ అయిన నాటి నుంచి ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలన్నది నిబంధన. దీంతో మే 27న పోలింగ్ తేదీని ఈసీ ప్రకటించింది. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న అభ్యర్థిగా ప్రకటించింది.