తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 731కి, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు వాటిని పరిశీలిస్తారు. ఈనెల 29 వరకు ఉపసంహరణ గడువు ఉండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి.

తెలంగాణతో పాటు ఏపీలో అగ్రనేతలు వరుసగా పర్యటించబోతున్నారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు. అమిత్ షా, రాజ్ నాత్ సింగ్ వంటి వారు ఇప్పటికే తెలంగాణలో సభలు నిర్వహించారు. ఏపీలోనూ మే మొదటి వారంలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. వచ్చే రెండు వారాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తనుంది. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు , ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఏపీలో 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు , 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.