ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. గ్రామంలో ప్రభుత్వ అధికారులు రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతల పర్వం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామంలో స్ధానికులు కోరుకోకపోయినా రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలకు దిగారు. దీంతో వారు అడ్డగించేందుకు ప్రయత్నించారు. చివరికి పలువురిని అరెస్టుచేసి మరీ తమ పని కానిచ్చేశారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి స్థలం ఇచ్చిన నాటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయి. రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారు. 100 ఇళ్లు పగల కొడతామంటూ నోటీసులు ఇచ్చారు. ఆ ఇళ్లు మొత్తం జనసేన మద్దతుదారులవే.

ఈ క్రమంలో శనివారం పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి చేరుకొని కూల్చిన ఇళ్లను పరిశీలిస్తున్నారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని హెచ్చరించారు. వాళ్లకు ఓటేయనివారు శత్రువులన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్నారు.మనవారు కానివారిని ‘తొక్కి నార తీయండి’ అనేలా ఏపీలో పాలన ఉందని పవన్ విమర్శించారు. వాళ్లకు ఓటేసిన 49.95 శాతం మందే పాలకులం అన్నట్లుగా ఉందన్నారు. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో జరుగుతోంది అరాచకమేనని పవన్ ఆరోపించారు. ఇప్పటికే 70 అడుగుల రోడ్దు ఉంటే ఇంకా విస్తరణేంటి? అన్నారు. రహదారి విస్తరణ వంకతో ఇళ్లు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.