నేడు తెలంగాణ దశాబ్ది వేడుకలు

తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావడంతో నేటి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉ.9.30గం.కు CM రేవంత్ గన్ పార్క్ లోని అమరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.55గం.కు పరేడ్ గ్రౌండ్లో జాతీయజెండా ఆవిష్కరిస్తారు. ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికార గేయంగా జాతికి అంకితమిస్తారు.

సాయంత్రం ట్యాంక్ బండ్ పై సంబరాలు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. చిన్నారులతో వచ్చేవారికి ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ జోన్, ఫొటో జోన్లను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్ కు చేరుకుని స్టాళ్లను సందర్శిస్తారు. 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహణకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ సమయంలోనే 13 నిమిషాల జయజయహే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేయనుంది ప్రభుత్వం. తర్వాత కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానించనున్నారు.

ఇటు తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. మూడురోజుల వేడుకల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం ఉదయం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించే సమావేశానికి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ప్రసంగిస్తారు. ఈనెల 3న బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేస్తారు.