తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్‌

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తో ఏపీకి ఉన్న సంబంధం తెగిపోయింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీలో 2016 ప్రాంతాల్లోనే రాజధానిగా అమరావతిని చేసుకుని అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. చిన్నాచితకా కార్యాలయాలు తప్ప హైదరాబాద్ లో ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాలు లేవు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆఫీసులను కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్ కొనసాగనుంది. విభజన చట్లం సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యతను గవర్నర్ కు అప్పటి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. నేటి నుంచి ఆ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఇప్పటికే అత్యంత కీలకమైన ఉమ్మడి హైకోర్టు విభజన సమస్య గతంలోనే పరిష్కారమైంది. 2018 డిసెంబర్‌ 18న నోటిఫికేషన్‌ విడుదలై, 2019 జనవరి 1న ఏపీ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటైంది. ఢిల్లీలోని ఉమ్మడిభవన్‌ విభజన పూర్తయింది. ఏపీ, తెలంగాణ భవన్‌కు స్థలాలను కేటాయించారు. ఇదిలా ఉంటే అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ గుదిబండగా మారింది. అపెక్స్‌ కమిటీలు, నదీ యాజమాన్య బోర్డుల మధ్యే నలుగుతున్నది. దీనిపై కేంద్రం ఎటూ తేల్చటం లేదు. రాష్ట్ర విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థలు, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన తేలలేదు. 68 సంస్థల విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలిపింది.

ఏపీ ముందుకురాకపోవటంతో వీటి విభజన పూర్తికాలేదు. ఆస్తుల పంపిణీ వివాదాలు, ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం ఇంకా జరగలేదు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయించాలని ఉద్యోగసంఘాలు కోరినా ఇప్పటి వరకు ఫలితం లేకుండా పోయింది. తెలంగాణకు ప్రయోజనం చేకూర్చాలని పదేండ్ల బీఆర్‌ఎస్‌ సర్కారు కాళ్లరిగేలా తిరిగినా కేంద్రం కనికరించలేదు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను గాలికొదిలేసింది. కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. జాతీయ ప్రాజెక్ట్‌ కేటాయింపు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, అసెంబ్లీ స్థానాల పెంపును పక్కనపెట్టేసింది. మరి ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి.