కాంగ్రెస్‌కు లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి రాజీనామా

Grandson of former PM Lal Bahadur Shastri resigns from Congres, joins BJP

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మ‌రో జ‌ల‌క్ త‌గిలింది. ఆ పార్టీకి విభాక‌ర్ శాస్త్రి రాజీనామా చేశారు. మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌నువ‌డే విభాక‌ర్ శాస్త్రి. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేకు పంపిన లేఖ‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో విభాక‌ర్ శాస్త్రి మ‌న‌స్తాపంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. విభాకర్ శాస్త్రి ఆ తర్వాత బిజెపిలో చేరారు. ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, బాబా సిద్ధిఖీ తదితరులు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

బిజెపిలో చేరిన అనంతరం విభాకర్ శాస్త్రి మాట్లాడుతూ… ‘నా కోసం బిజెపి తలుపులు తెరిచినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, నడ్డా, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్‌లకు కృతజ్ఞతలు. మా తాత లాల్ బహదూర్ శాస్త్రి దార్శనికతను ముందుకు తీసుకువెళ్లడానికి బిజెపి అవకాశం ఇచ్చిందని భావిస్తున్నాను. పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తాను. ఇండియా కూటమికి ఎలాంటి సిద్ధాంతం లేదు. కేవలం మోడీని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ సిద్ధాంతం ఏమిటో రాహుల్ చెప్పాలి’ అన్నారు.