జమ్మికుంటలో టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంటిముందు తీవ్ర ఉద్రిక్తత

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ వాడి వేడిగా నడుస్తుంది. తెరాస , బిజెపి పార్టీ లు ఒకరి ఫై ఒకరు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు చేసుకుంటున్నారు. పలు చోట తెరాస నేతలు డబ్బులు పంచుతుండగా బిజెపి కార్య కర్తలు అడ్డుకొని , పోలీసులకు అప్పజెపుతున్నారు. ఈ క్రమంలో జమ్మికుంటలో టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంటిముందు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ఆమె ఇంటి దగ్గర ముగ్గురు నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్తి ఇంటి దగ్గర దొంగ ఓట్లు వేసేవారికి డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆమె ఇంటి పెంట్ హౌస్‎లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఉన్నాడని బీజేపీ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మాటల యుద్ధం పెరగడంతో.. సీపీ సత్యనారాయణ అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఆ ఇంట్లో ఎవరూ లేరని సీపీ స్పష్టం చేశారు. ఏ ఎమ్మెల్యే లేడని, ఎటువంటి డబ్బులు లేవని ఆయన చెప్పారు. ఇద్దరు మీడియా ప్రతినిధులను ఇంట్లోకి తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూపించారు.

ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం ఓట్లు నమోదయింది. ఇదే ట్రెండ్ కొనసాగితే సాయంత్రంలోపు 85 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు చోట్ల ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ… ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. అత్యధికంగా వీణవంక మండలంలో 47.65 శాతం పోలింగ్ నమోదవ్వగా 19 వేల 106 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అత్యంత తక్కువగా ఇల్లందకుంటలో 42.09 శాతం పోలింగ్‌ నమోదవ్వగా 10 వేల 439 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక హుజూరాబాద్‌లో 45.05 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 27 వేల 784 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లో 46.76 శాతం, జమ్మికుంటలో 45.36 శాతం పోలింగ్ నమోదైంది.