టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల మధ్య ఘర్షణ

గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత

TDP and YSRCP
TDP and YSRCP

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి నేతలు, వైఎస్‌ఆర్‌సిపి నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద టిడిపి, ఐకాస శ్రేణులు రిలే దీక్షను చేపట్టాయి. వీరి దీక్షా శిబిరంపై టమాటాలు, కోడిగుడ్లతో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు దాడి చేశారు. అంతేకాదు శిబిరానికి నిప్పు పెట్టి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన టిడిపి కార్యకర్తలు శిబిరానికి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాదన జరిగింది. వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు చేసిన దాడిలో టిడిపి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్ గాయపడ్డారు. ఈ దాడి సమాచారం అందుకున్న వెంటనే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాదర్ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/