కుప్పం లో టెన్షన్ వాతావరణం..టీడీపీ కార్యకర్తలఫై పోలీసుల లాఠీఛార్జ్

చంద్రబాబు కుప్పం పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. చంద్రబాబు పర్యటనకు పోలీసులు అడ్డు చెప్పడం తో టిడిపి కార్య కర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శాంతిపురం లో చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు , కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు. అలాగే పలువురు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు ఎత్తిపడేసి ఆందోళనకు దిగారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ను ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబుకు పర్యటనకు అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా సభలు నిర్వహించినా, అందులో పాల్గొన్నా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.

మూడు రోజుల కుప్పం పర్యటన కు గాను చంద్రబాబు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ నుండి బెంగళూరు ఎయిర్ పోర్టు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామం చేరుకోవాలని , రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించాలని అనుకున్నారు. రేపు కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని, రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేయాలనీ, ఈ నెల 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించాలని అనుకున్నారు. దీనికి తగ్గట్లే షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. కానీ ఇటీవల చంద్రబాబు నిర్వహించిన కందుకూరు , గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మరణించారు. దీంతో హోమ్ శాఖ రాష్ట్రంలో ఎలాంటి ర్యాలీ లు , సభలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.