10 రోజుల పాటు బీజేపీ అభ్యర్థుల తరఫున తమిళిసై ప్రచారం

Tamilisai campaign on behalf of BJP candidates for 10 days

హైదరాబాద్‌ః మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తెలంగాణలో పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. తమిళనాడులోని 39 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. ఆమె తెలంగాణ గవర్నర్‌గా దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పని చేశారు. ఈ క్రమంలో ఆమె తెలంగాణలో బీజేపీ తరఫున 10 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఆమె ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం ఆమె ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమెకు పలువురు బీజేపీ నాయకులు హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికారు. ఆమె హైదరాబాద్‌లో ఉంటూనే వివిధ లోక్ సభ నియోజకవర్గ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ రోజు రాజధాని నగరంలో ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణ ప్రజలు అంటే తనకు ఎంతో అభిమానమని… వారిని మరోసారి కలుసుకునే అవకాశం రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు.