మోడీ ఇంటిపేరు కేసు..రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ

supreme-court-to-hear-rahul-gandhi-petition-on-gujarat-high-court-orders-on-july-21-in-modi-surname-case

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పరువునష్టం కేసులో రాహుల్‌ను దోషిగా తేలుస్తూ సూరత్‌ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై స్టే విధించాలని ఆయన గుజరాత్‌ హైకోర్టు గడప తొక్కారు. అయితే స్టేకు నిరాకరిస్తూ కోర్టు ఈ నెల 7న తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టులో ఈ నెల 15న పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించేందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు.. ఈ నెల 21న బెంచ్‌ ముందుకు రానుంది. కాగా, రాహుల్‌ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరుఫు న్యాయవాది అభిషేక్‌ మను సింగ్వీ న్యాయస్థానాన్ని కోరారు. అయితే దానికి న్యాయమూర్తి నిరాకరించారు.

2019 ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ మాట్లాడుతూ ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరే ఎందుకు ఉంటోందో?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు ద్వారా రాహుల్‌ తమ పరువుకు భంగం కల్పించారని గుజరాత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ కోర్టులో పరువు నష్టం దావావేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చింది. రెండేండ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే (మార్చి 24న) ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 బలమైన సెక్షన్‌ 8 ప్రకారం ఆయనపై వేటు వేసినట్లు లోక్‌సభ కార్యదర్శి అప్పట్లో ప్రకటించారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే సూరత్‌ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాహుల్‌ గుజారాత్‌ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. సూరత్‌ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.