డీజీపీ ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిళ్లతో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

ఈవెంట్స్‌లో లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ నిబంధనలపై కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం డీజీపీ ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేసారు. పెద్ద ఎత్తున డీజీపీ ఆఫీస్ వద్ద కు చేరుకున్న అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరిస్తూ ఆందోళనకు దిగారు. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వెళ్లిపోవాలని అభ్యర్థులకు పోలీసులు తెలపగా.. అందుకు వాళ్లు నిరాకరించారు. దీంతో ఆందోళన చేస్తున్న అభ్యర్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు పోలీసులు తరలించారు.

ఈవెంట్స్‌లో లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ నిబంధనలపై వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తమ విన్నపాలను వినకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆందోళన చేసారు. అయితే ఈ ఘటనలో ఐదుగురుపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌పై మొదటి నుండి వివాదం నడుస్తూనే ఉంది. రిక్రూట్‌మెంట్ సరిగ్గా జరపడం లేదని అభ్యర్థులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రగతిభవన్‌కు కూడా ముట్టడించగా.. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈరోజు మరోసారి అరెస్టుల పర్వం నడిచింది.