తన అరెస్టుకు రంగం సిద్ధంచేస్తున్నారని కోటంరెడ్డి ఆరోపణ

తన అరెస్టుకు రంగం సిద్ధమైందని.. సజ్జల లీకులు వదులుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేసారని ఆరోపిస్తూ వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..సజ్జలతో పాటు వైస్సార్సీపీ మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు తనపై చేసిన ఆరోపణలకు మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆడియోలు వదులుతున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తన అరెస్టుకు రంగం సిద్ధమైందని సజ్జల లీకులు వదులుతున్నారని ఆరోపించారు.

థియేటర్ యజమానుల నుంచి నెలనెలా రూ.2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నానంటూ తనపై విష ప్రచారం చేస్తున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. జీవితాంతం జైలులో ఉంచినా తన గొంతు మాత్రం అణచలేరని తేల్చిచెప్పారు. తన గొంతును నొక్కేయాలంటే ఒక్కటే పరిష్కారం ఉందని.. అది ఎన్ కౌంటర్ చేయించడమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 25 వ తేదీన చంద్రబాబు ను కలిసినట్లు చెపుతున్నారని , కానీ తాను క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నానని కోటంరెడ్డి వివరణ ఇచ్చారు. టీడీపీ అధినేతను తాను కలవలేదని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి, తమ్ముడు అనిల్‌ కుమార్‌ యాదవ్ వ్యాఖ్యలు బాధించాయని.. అనిల్ ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని.. తన పిల్లల ప్రస్తావన ఎందుకన్నారు. తన కుటుంబం అనిల్ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదని.. తనకు అధికార దాహం ఉంటే ఆనాడే టీడీపీ పార్టీలో చేరేవాడిని అన్నారు. తాను ప్రతిపక్షంలో టీడీపీ పై పోరాడాను అన్నారు. అనిల్ కుమార్ యాదవ్‌‌ను కార్పొరేట్ చేసింది ఎవరు.. ఎమ్మెల్యేని చేసింది ఎవరు.. ఆనం వివేకానంద రెడ్డి కాదా అన్నారు. ఆనం కుటుంబం పై మాట్లాడిన మాటలు మర్చిపోయావా.. అనిల్ మంత్రి అయిన రోజు ఎంత మంది ఎమ్మెల్యేలు ఆయనతో వచ్చారన్నారు. గతంలో చంద్రబాబును అనిల్ ఎందుకు కలిశారని.. బెంజ్ కారులో వెళ్లి కలిస్తే అప్పుడు నిఘా ఏమైందని ప్రశ్నించారు శ్రీధర్ రెడ్డి.