నాందేడ్ లో సీఎం కేసీఆర్ స‌భ ఏర్పట్లను పరిశీలించిన బిఆర్ఎస్ నేతలు

ఫిబ్రవరి 05 న మ‌హారాష్ట్రలోని నాందేడ్ లో బిఆర్ఎస్ భారీ సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సభ ఏర్పట్లను శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి , ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, విఠ‌ల్ రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు, త‌దిత‌రులు పరిశీలించారు. సభాస్థలిలో నిర్వాహకులతో మాట్లాడారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మ‌హారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున స‌భ‌కు హాజ‌రుకానున్నారు. అందువల్ల కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అంద‌రూ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌గా రూపాంత‌రం చెందిన‌ త‌ర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వహించ‌నున్న తొలి స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నామ‌న్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. టీఆర్‌ఎస్‌…. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్మ‌ల్ జిల్లా స‌రిహ‌ద్దు ప్రాంతం నాందేడ్ లో స‌భ‌ నిర్వహించడం సంతోషంగా ఉంద‌న్నారు. నాందేడ్ సభలో పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారని వెల్ల‌డించారు. మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్ కు అనూహ్య స్పంద‌న వ‌స్తుంద‌ని, నాందేడ్ జిల్లాలో అనేక గ్రామాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు మ‌హారాష్ట్ర‌లో అమ‌లు చేస్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు వ్యాఖ్యనిస్తున్నార‌ని, బీఆర్ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌పై కూడా ఎంతో ఆస‌క్తి క‌న‌బరుస్తున్నారని తెలిపారు.