నేడు ఢిల్లీలో జాతీయ కార్యవర్గం సమావేశానికి శరద్‌ పవార్‌ పిలుపు..!

Sharad Pawar calls NCP’s National Executive meeting in Delhi t..

న్యూఢిల్లీః నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ గురువారం ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల నేతలు భేటీకి హాజరుకానున్నారు. మహారాష్ట్రలో ఆ పార్టీ నేత అజిత్‌ పవార్‌ తిరుగుబాటు చేయడంతో.. రెండు వర్గాలుగా పార్టీ విడిపోయింది. ఈ క్రమంలో పవార్‌ ఈ సమావేశంతో నేతలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు, పార్టీని చీల్చడంలో పవార్‌ విజయవంతమయ్యారు. జులై 2న ఎన్సీపీ చీలిక అనంతరం రెండు వర్గాలు బుధవారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి, తమ బలాబలాన్ని చాటుకున్నాయి.

మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలలో 32 మంది అజిత్ వర్గం సమావేశానికి హాజరయ్యారు. అదే సమయంలో శరద్ పవార్ వర్గం సమావేశానికి 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు శాసనమండలి సభ్యులు, నలుగురు ఎంపీలు హాజరయ్యారు. ఇక పార్టీ, ఎన్నికల గుర్తుపై ఇరువర్గాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. అజిత్ వర్గం తనకు మద్దతుగా 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు ఉందని అఫిడవిట్లను ఇచ్చింది. పలువురు ఎమ్మెల్సీలు సైతం మద్దతు తెలిపారు. మరోవైపు దక్షిణ ముంబైలోని యశ్వంతరావ్ చవాన్ ప్రతిష్ఠాన్‌లో జరిగిన సమావేశంలో శరద్ పవార్ అజిత్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు అవమానాల్ని భరించానని, అతను (శరద్ పవార్) మహారాష్ట్రలో పర్యటిస్తే తాను సైతం పర్యటించి తగిన సమాధానం ఇస్తానన్నారు.

మరో వైపు శరద్‌ పవార్‌ స్పందిస్తూ.. ఎన్నికల గుర్తు ఎక్కడికీ పోదని, ఎక్కడికీ వెళ్లవమన్న ఆయన.. తాను లేకుండా వారి నాణెం పరుగెత్తదన్నారు. అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ వెంటే ఉన్నారన్నారు. జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. ఎన్సీపీ రూ.70వేల కోట్ల కుంభకోణం చేసిందని ప్రధాని అన్నారని, ఈ ఆరోపణ నిరాధారమని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఒకవైపు మా పార్టీ నేతలను విమర్శలు చేస్తూనే.. రెండు రోజుల కిందట మహారాష్ట్ర ప్రభుత్వంలో మా సొంత పార్టీ నేతలనే ఎందుకు మంత్రులుగా తీసుకున్నారని ప్రశ్నించారు.