కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని మానకొండూరులో చోటుచేసుకుంది. మానకొండూరులోని బుడిగ జంగాల కాలనీకి చెందిన రాజవ్వ, లచ్చవ్వ ఇద్దరు బుధువారం తెల్లవారు జామున రోడ్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారిపైకి దూసుకొని వెళ్ళింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను మానకొండూరులోని బుడిగ జంగాల కాలనీకి చెందిన రాజవ్వ, లచ్చవ్వగా గుర్తించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు మహిళలకు భర్తలు లేరని , కనీసం వారికీ ఇల్లులు కూడా లేవని రోడ్ పక్కన గుడిసె వేసుకొని జీవిస్తున్నారని , వారి పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.